Komatireddy Venkat Reddy: కార్యకర్తల కోసం నా ప్రాణాలైనా ఇస్తా... నా కొడుకు లేడు, మీరే వారసులు: మంత్రి కోమటిరెడ్డి భావోద్వేగం

  • గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించిన కార్యకర్తలకు చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనని వ్యాఖ్య
  • లోక్ సభ ఎన్నికల్లో రఘువీర్‌కు భారీ మెజార్టీ ఇవ్వాలన్న కోమటిరెడ్డి
  • రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా
Komatireddy emotional speech in Nalgonda

'కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైనా ఇస్తా. నాకు కొడుకు లేడు. మీరే నా వారసుల'ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. నల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గల్లీ నుంచి ఢిల్లీ వరకు తనను పంపించిన మీకు (కార్యకర్తలు) నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అన్నారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించానన్నారు. ముఖ్యమంత్రి వద్ద ఏ పని కావాలన్నా తాను చేసుకొని వస్తానన్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లోనూ మన అభ్యర్థికి భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు.

కాబోయే ఎంపీ రఘువీర్‌తో కలిసి సర్పంచ్ ఎన్నికల్లో మీకోసం పని చేస్తామని హామీ ఇచ్చారు. పేద పిల్లల చదువు బాధ్యతను ప్రతీక్ ఫౌండేషన్ తీసుకుంటుందన్నారు. నీళ్ల కరవుకు కారణం బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. కేసీఆర్ ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కన పెట్టారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పదివేల ఇళ్లు కడతామన్నారు. కేసీఆర్, కేటీఆర్ మానసిక పరిస్థితి దిగజారిందని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటు వేస్తే మూసీనదిలో వేసినట్లే అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. పంద్రాగస్ట్ లోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమేనని సవాల్ చేశారు. అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని చురక అంటించారు.

More Telugu News